ఆపదలో ఆదుకున్న వారిని కొందరు వెంటనే మర్చిపోతుంటారు. మరికొందరు మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. వారికి రుణపడి ఉంటారు.
Hyderabad: ఆపదలో ఆదుకున్న వారిని కొందరు వెంటనే మర్చిపోతుంటారు. మరికొందరు మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. వారికి రుణపడి ఉంటారు. ఇంకా కొందరయితే దేవుడిలా కొలుస్తారు. ఇలానే తన ప్రాణాలు కాపాడిన పోలీసును తొమ్మిదేళ్ల తర్వాత చూసి ఓ మహిళ భావోద్వేగానికి గురయింది. పరుగెత్తుకుంటూ వెళ్లి మరీ అతన్ని కలుసుకుంది.
రవీందర్ అనే పోలీస్ అధికారి 2014లో హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కవిత అనే మహిళ అనారోగ్యంతో రోడ్డుపై ఉండడాన్ని చూసి సాయం అందించారు. ఆసుపత్రిలో చేర్పించి సొంత డబ్బులతో చికిత్స చేయించారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు ఆమెకు అండగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు ట్రాన్ఫర్ కావడంతో వెళ్లి ప్రాంతానికి వెళ్లిపోయారు.
ప్రస్తుతం రవీందర్ మహంకాళి ఏసీపీగా పనిచేస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ ఆర్పీ రోడ్‌లో రవీందర్.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధులు నిర్వర్తిస్తుండగా.. కవిత అతన్ని గుర్తించింది. బస్సులో వెళ్తున్న కవిత.. కొంత దూరంలో ఆపి అతని వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. రోడ్డుపై కవిత పరుగెత్తుకుంటూ వెళ్తుంటే.. ఆమె ఏదో మరిచిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ ఆమె ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి అతన్ని కలిసింది. ఆయనతో ముచ్చటించింది. చాలా రోజుల తర్వాత ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని కవిత చెప్పింది. తాను ఇప్పుడు బతికి ఉండడానికి కారణం అతనేనని కన్నీరు పెట్టుకుంది. ఆయన కోసం వెండి రాఖీ కొన్నానని.. పండుగ రోజు వెళ్లి కడుతానని చెప్పింది. ఆమె ఫోన్ వాల్ పేపర్ ఏసీపీ ఫొటో ఉండడాన్ని చూసి రవీందర్‌తో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొందరు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.