Harish Rao: కేంద్రం తెలంగాణ రైతులను ఆగం చేయాలని చూసింది.. తాము ఆదుకున్నాం: మంత్రి హరీష్ రావు
Harish Rao Fire On Central Govt: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రైతుల వడ్లను కొనుగోలు చేయకపోయినా తాము మాత్రం ధాన్యాన్ని కొని రైతులను ఆదుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్న కేంద్రం ధాన్యం విషయంలో ఎందుకు స్పందిచడంలేని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మాత్రం బియ్యం తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని మంత్రి విమర్శించారు. బీజేపీ నేతలకు రైతుల వడ్లు వద్దు కానీ వారి ఓట్లు కావాలా అని మండిపడ్డారు.
రైతుల కోసం ఢిల్లీలో ధర్నా చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. కష్ట కాలంలో టిఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. దేశంలో రైతు బంధు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, రైతుల పట్ల బీజేపీది ద్వంద వైఖరని విమర్శించారు. వడ్లు కొంటరా కొనరా అనే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలన్నారు. తెలంగాణా రైతాంగ ఆగ్రహానికి బీజేపీ నేతలు బలవుతారని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.