TRS and BJP Activists Come to Blows in Munugode Election Campaign: మునుగోడు లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఉద్రిక్తత ఏర్పడింది. మరి కొద్ది గంటల్లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ -బీజేపీ నేతలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకొనేందుకు చివరి నిమిషం దాకా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చివరి రోజున ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్న సమయంలోనే, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డి అక్కడ ప్రచారానికి చేరుకున్నారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు.. వాగ్వాదం మొదలై రాళ్ల దాడి వరకు వెళ్లింది.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పైన రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఈటల గన్ మెన్లతో పాటుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సైతం గాయాల బారిన పడినట్లు సమాచారం అందుతుంది. రెండు పార్టీల కార్యకర్తలతో కర్రలతో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ జగదీష్ కారు పైన బీజేపీ శ్రేణులు దాడి చేసారని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. తన కాన్వాయ్ పైన దాడి చేయటం పైన ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికార పార్టీకి చెందిన వారే చేయించారని ఆరోపిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.