Telangana Rtc: సంస్కరణల బాటలో దూకుడుగా వెళుతోన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు నష్టాలు గణనీయంగా తగ్గాయి. కీలక నిర్ణయాలతో ప్రయాణికులకు దగ్గరవుతోన్న ఆర్టీసీ త్వరలో లాభాల బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి గుదిబండలా మారిన ఆర్టీసి తీసుకుంటున్న తాజా నిర్ణయాలుసత్ఫలితాలివ్వటం యాజమాన్యానికి ఊరట కల్పిస్తోంది. ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక తీసుకొస్తున్న అనేక మార్పులు- చేర్పులు ఆ సంస్థను ప్రగతిపథంలో తీసుకెళ్లడం ఖాయమని అంచనా?
లెక్కలేం చెబుతున్నాయంటే..
కిందటేడాది నష్టాలను చూసినా ఇదే స్పష్టమవుతోంది. 2018-19లో రూ.928.68 నష్టం రాగా 2022-23లో అది రూ.672.29 కోట్లకు తగ్గింది. 2021-22లో రూ.1,986.58 కోట్ల నష్టం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన రీయింబర్స్మెంట్ లెక్కల మూల్యాంకనం కొద్దిరోజుల క్రితం పూర్తయింది. దాని ప్రకారం నష్టం రూ.672.29 కోట్లు అని తేలింది. ఆర్టీసీలో మూడు జోన్లు, 10 రీజియన్లు ఉన్నాయి. ఏ ఒక్క రీజియన్ కూడా లాభాల్ని గడించలేదు. మొత్తం నష్టంలో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచే వచ్చింది. రీజియన్లలో అతి తక్కువ నష్టాలతో నల్గొండ తొలి స్థానంలో నిలిచింది. ఈ రీజియన్ పరిధిలో 2021-22తో పోలిస్తే 2022-23లో నష్టాలు 95.8 శాతం తగ్గాయి. రంగారెడ్డి రీజియన్లో 84.2 శాతం, ఖమ్మంలో 79.3, మెదక్లో 76 శాతం నష్టాలు తగ్గాయి.
కీలక నిర్ణయాలే కారణమా?
ఈ మధ్య టీఎస్ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే నష్టాలు తగ్గటానికి ప్రధాన కారణమైంది. ఎలక్ట్రిక్ బస్సులు, కొత్త బస్సులు ద్వారా ఆర్టీసీ ప్రగతి పథంలో నడుస్తోంది. వీటితో పాటు పల్లెల్లో ఆర్టీసీ ఆఫీసర్లను నియమించటం ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు మెరుగయ్యాయి. అదనపు డీజిల్ సెస్ కూడా లాభాలను ఆర్టీసీకి తెచ్చిపెడుతోంది. బస్ పాసుల జారీలో తీసుకొచ్చిన మార్పులు కూడా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.
సిటీ జనానికి మరింత దగ్గర
హైదరాబాద్ కు నిత్యం వచ్చే ప్రయాణికులకు దగ్గరవడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్ పాస్ రేట్లు తగ్గించటం,మహిళలకు రాయితీ కల్పించటం, రూట్ పాసులు కూడా అమల్లోకి తీసుకురావటం వంటి విధానాలు ఆర్టీసిని నష్టాలనుంచి గట్టెక్కిస్తున్నాయి.
డీజిల్ భారం…
గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను చూసినప్పుడు ఆర్టీసీకి ప్రయాణికుల టికెట్లు, బస్టాండ్లలో వాణిజ్య అద్దెలు, కార్గో వంటి రూపాల్లో వచ్చిన మొత్తం ఆదాయం కంటే ఖర్చు అధికంగా ఉంది. డీజిల్ ధరల పెరుగుదలతో ఇంధన ఖర్చు బాగా ఎక్కువైంది. సంస్థ వ్యయంలో ఉద్యోగుల వేతనాలు, గతంలో తీసుకున్న రుణాలకు వాయిదాల చెల్లింపులు, అధికారుల కోసం కొనుగోలు చేసిన కొత్త కార్లు వంటి ఖర్చులు అధికంగా ఉన్నాయి.
నష్టాలు తగ్టానికి ఇవే కారణాలు…
2021-22తో పోలిస్తే నష్టాలు బాగా తగ్గడానికి గల కారణాల్లో భారీగా నడిపిన అదనపు కిలోమీటర్లతో వచ్చిన ఆదాయం ఒకటిగా ఉంది. ప్రభుత్వం నుంచి అంతకుముందు ఏడాది కంటే రాయితీ బస్పాసుల రీయింబర్స్మెంట్ ఎక్కువగా రావడం మరొకటని సమాచారం. ఆర్టీసీ వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడలతో పరోక్ష బాదుడు వల్ల వచ్చిన అదనపు ఆదాయం, ఉన్నతాధికారులు చేపట్టిన సంస్కరణలు కూడా కొంత ఉపశమనానికి కారణమని తెలుస్తోంది.
ఇదే ఉత్సాహం మరో ఏడాది
మరో ఏడాది ఇదే ఉత్సాహంతో కొనసాగితే ఆర్టీసీ నష్టాల నుంచి పూర్తిగా బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల నష్టాలు మెల్లగా తగ్గడం ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు.