CS Shanthi Kumari: తెలంగాణ కొత్త సీఎస్ గా శాంతికుమారిని కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు?
Telangana CS Shanthi Kumari Background: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా శాంతి కుమారి అనే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి నియమితులయ్యారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సోమేశ్ కుమార్ ను మంగళవారం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణకు చెందిన మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ఎవరు? కేసీఆర్ ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు? అనే విషయం మీద చర్చ జరుగుతుంది. అయితే వాస్తవానికి 2019 డిసెంబర్ 31వ తేదీన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సోమేశ్ కుమార్ ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఐఏఎస్ అధికారులందరికీ పోస్టింగులు ఇచ్చే క్యాట్ ని ఆశ్రయించారు.
ఏపీకి తనను కేటాయించడం కరెక్ట్ కాదంటూ స్టే కోరగా స్టే లభించింది. అయితే ఆ క్యాడర్ కేటాయింపులు జరిపిన కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం అప్పీల్ ను అనుమతించి క్యాట్ ఆర్డర్ ను కొట్టి వేసింది. ఈ క్రమంలోనే సోమేశ్ కుమార్ ని ఆంధ్ర ప్రదేశ్ కేటాయిస్తూ తుది తీర్పు ప్రకటించచారు. నిజానికి 1989 బీహార్ కి చెందిన సోమేశ్ కుమార్ ట్రైనింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడ్డారు, రెండు రాష్ట్రాల విభజన తర్వాత కేంద్రం అధికారుల విభజన కూడా చేపట్టడంతో ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించగా ఆయన మాత్రం తెలంగాణలోనే పనిచేస్తానంటూ అప్పట్లో క్యాట్ ను ఆశ్రయించారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో జిహెచ్ఎంసి కమిషనర్ గా పని చేస్తూ వచ్చిన సోమేశ్ కుమార్ ఆ తర్వాత పలు కీలక బాధ్యతలు చేపట్టి చివరికి తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆయన నిష్క్రమణం తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమించబడతారు? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే 1989 బ్యాచ్ కే చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాంతి కుమారి పేరు మీదకు వచ్చింది. ప్రస్తుతం శాంతి కుమారి తెలంగాణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
అంత కుముందు ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా పనిచేశారు, తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర ఐపాస్ ప్రత్యేక అధికారిగా పని చేయడంతో పాటు సీఎం ఆఫీస్ లో ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ రోజుల్లోనే మెరైన్ బయాలజీ లో ఎమ్మెస్సీ చదివిన శాంతి కుమారి ఎంబీఏ అమెరికాలో పూర్తి చేసి తరువాత కేంద్ర సర్వీసులోకి వచ్చారు. సీఎంఓలో పని చేస్తున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత సన్నిహితురాలుగా పేరు తెచ్చుకున్న ఆమెకు కేసీఆర్ పట్టం కట్టారు. పదవీ విరమణ వరకు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.