Intermediate Supplementary Exams : ఫీజు చెల్లించడానికి గడువు పెంపు
Telangana intermediate board extends supplementary exam fees date : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణాలో వారం రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు కోసం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఇప్పటి వరకు ఫీజు చెల్లించలేకపోయిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం గడువును పెంచింది. జూలై 18, 19 తేదీల్లో లేట్ ఫీజు రూ.200లతో కలిపి చెల్లించవచ్చని ప్రకటించింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శుక్రవారం అన్ని జూనియర్ కళాశాలలను విద్యార్థుల నుండి ఆలస్య రుసుముతో పాటు పరీక్ష రుసుమును అంగీకరించి, జూలై 19 లేదా అంతకు ముందు సాయంత్రం 5 గంటల వరకు బోర్డుకు పంపాలని కోరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని వారిని ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించారు.