తెలంగాణలో పొలిటికల్ గ్రాఫ్ వేగంగా ఛేంజ్ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Telangana: తెలంగాణలో పొలిటికల్ గ్రాఫ్ వేగంగా ఛేంజ్ అవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఒక్కసారిగా పాలిటిక్స్‌ను హీటెక్కించారు. మొత్తం 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఆ జాబితానే ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద మైనస్‌గా మారింది. తీవ్ర ప్రభావం చూపుతోంది. బీఆర్ఎస్పై వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కేసీఆర్‌ను మించి బీఆర్ఎస్ అధికార ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది.
అదే సమయంలో టి.కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటోంది. మరింత బలపడుతోంది. తెలంగాణలో కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు చేరడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా పెరిగిపోయాయి. అటు కేసీఆర్ టికెట్ ఆశించిన కొందరు దిగ్గజ నేతలకు మొండి చేయి చూపించారు. దీంతో వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. రెపో.. మోపో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణలో బీజేపీ మరింత వెనుక పడింది. ఊహించిన రీతిలో పుంజుకోకపోవడమే కాకుండా.. మరింత దిగజరిపోయింది. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి.
ఇక ప్రతివారంలానే ఈ వారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ నివేదికను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై సర్వే చేసి నివేదికను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం బీఆర్ఎస్కు వ్యతిరేకత పెరిగిపోయిందనేది స్పష్టంగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ గెలుపు శాతం కూడా తగ్గిపోయింది. పోయిన వారం బీఆర్ఎస్కు 40.5 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని నివేదికలో వెల్లడయింది. కానీ ఈ వారం 3.05 శాతం తగ్గిపోయింది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 37 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది.
అటు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఓట్లు పడే అవకాశం 2.3 శాతం పెరిగింది. పోయిన వారం కాంగ్రెస్‌కు ఓట్లు పడే శాతం 26.9 శాతం ఉండగా.. ఇప్పుడు అది 29.2 శాతానికి చేరుకుంది. ఇక బీజేపీ మరింత వెనుకబడిందని నివేదికలో తేలింది. గత వారం బీజేపీకి 12.8 శాతం ఓట్లు పడే అవకాశం ఉండగా.. ఈ వారం అది 1.4 శాతం తగ్గి 11.4 శాతానికి చేరింది. హంగ్ ఏర్పడే అవకాశం 6.2 శాతం ఉందని నివేదికలో వెల్లడయింది. 8.5 శాతం ఓట్లు ఏ పార్టీకి పడుతాయో స్పష్టంగా తెలియదని.. 7.7 శాతం ఓట్లు మాత్రం బీఆర్ఎస్కు కాకుండా.. కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి పడే అవకాశం ఉందని తెలంగాణ ఇంటెన్షన్ విడుదల చేసిన నివేదికలో తేలింది.
ఇకపోతే అభ్యర్థులను సెలక్ట్ చేయడంలో కేసీఆర్ ఈసారి కొంత విఫలమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. కేసీఆర్ కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత 4 శాతం అధికంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. అలాగే సానుకూలతలో కేసీఆర్.. ఎమ్మెల్యేలకంటే 7 పాయింట్లు ముందున్నట్లు వెల్లడయింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గెలుపు అవకాశాల్లో కేవలం 7.8 శాతం మాత్రమే తేడా ఉంది. వచ్చే వారం బీఆర్ఎస్ను కాంగ్రెస్ అధిగమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. సర్వే నివేదికలను పరిశీలిస్తే బీఆర్ఎస్ను ఢీ కొట్టే అవకాశాలు కాంగ్రెస్‌కు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వేతో రాష్ట్రంలో కీలక చర్చ మొదలయింది. ఈ నివేదిక ప్రకారం ఇదే జోష్‌ను కాంగ్రెస్ కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ గద్దె దించడం ఖాయమనేది స్పష్టంగా తెలుస్తోంది.