గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్పీఎస్సీ..(TSPSC) అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఫలితాలనూ కూడా ప్రకటించారు. అయితే పేపర్ లీక్ (Leak) నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు. రద్దయిన పరీక్షను రేపు నిర్వహించనున్నారు.
Group1 Preliminary Exam: గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిరుడు ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్పీఎస్సీ..(TSPSC) అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఫలితాలనూ కూడా ప్రకటించారు. అయితే పేపర్ లీక్ (Leak) నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు. రద్దయిన పరీక్షను రేపు నిర్వహించనున్నారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణకు హైకోర్టు (TS High Court) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. కాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ (Hall Tickets) చేసుకొన్నారు. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ (TSPSC)భావిస్తున్నది. దీని కోసం ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశాలు జరిపింది.
ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష (Group1 Preliminary Exam) జరగనుంది. అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు జిల్లాకొకటి చొప్పున 33 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్ష నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందిపై నిఘా పెట్టనున్నారు. పరీక్ష ప్రారంభానికి 2 గంటల ముందే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసేస్తారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. పరీక్షకు 15 రోజుల ముందే నమూనా పత్రాన్ని వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్ స్పష్టం చేసింది.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఆదివారం (Sunday) ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. పరీక్ష కేంద్రాలకు (Exam Centers) సమీపంలోని అన్ని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.