Telangana Govt: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు. ఒకరకంగా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు పెన్షనర్లకు కూడా శుభవార్త చెప్పినట్టు అయింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ కూడా చేశారు. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని, ఈ పెంపు గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని అన్నారు. 2.73శాతం డీఏ జూలై ఒకటి 2021 నుంచి అమలు చేయనుండగా ఈ నెల జీతంలో యాడ్ కానుంది. ఇక ఈ పెంపు వలన డిసెంబర్ 31 వరకు 1387 కోట్ల భారం పడనుంది, అలాగే ఈ నెల 77 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక మరోపక్క టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ల షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ల ప్రక్రియ జరగనుంది.