గూగుల్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత సామాజిక అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజా రవాణాను మెరుగుపర్చడంతో పాటు వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని సైతం మెరుగుపర్చడానికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి గూగుల్ సంస్థ మద్దతు తెలిపిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇందులో భాగంగా గచ్చిబౌలిలోని 7.3 ఎకరాల స్థలంలో గూగుల్ సంస్థ గ్రౌండ్ ఆప్ డెవలప్‌మెంట్ డిజైన్‌ను ఆవిష్కరించిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగర భవిష్యత్తు, కేంద్రీకృత టాలెంట్ పూల్‌ను దృష్టిలో ఉంచుకొని గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. గూగుల్ సంస్థ 2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని కేటీఆర్ గుర్తు చేశారు. డిజిటల్ తెలంగాణ అనే ఆలోచనకు మద్దతుగా ప్రతీ పౌరుడిని డిజిటల్‌గా సాధికారత సాధించాలనేది తమ లక్ష్యమని కేటీఆర్ పేర్కొన్నారు.