తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రోజువారీ కార్యక్రమాలు షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రోజువారీ కార్యక్రమాలు షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కెసిఆర్ తెలిపారు. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు జరగాలని కెసిఆర్ అధికారులను కోరారు. ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో అధికారులకు సీఎం సూచించారు. నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు , జడ్పిచేర్మెన్లు ప్రజాప్రతినిధులు, పభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ దశాబ్ది వేడుకలలో భాగంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం ఉత్సవ సందేశం ఇవ్వనున్నారు. ఉత్సవాలకు సంబంధించిన 105 కోట్ల నిధులను విడుదల చేసారు. రోజుకో రూపంగా నిర్వహించాలని సూచించింది. 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న నీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం, 22 అమరుల సంసరణ సభ ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ దశాబ్ది వేడుకలను ఎలక్షన్స్ కు అనుగునంగా కేసీఆర్ మార్చుకుంటున్నాడని విపక్ష పార్టీలవారుఆరోపిస్తున్నారు.
తెలంగాణ సర్కార్ కు ధీటుగా టీ కాంగ్రెస్ కూడా తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై 20 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని టి కాంగ్రెస్ తెలిపింది. తొమ్మిదేళ్లలో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్.. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాలాభిషేకం చేసి.. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై జెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2న గాంధీభవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పుడు లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ ఉన్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆమెను ఘనంగా సన్మానించుకుంటామని చెప్పారు. జూన్-2న నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీని మీరా కుమార్ ప్రారంభిస్తారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మేము సైతం నిర్వహిస్తామని బీజేపీ అంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కేంద్రం సూచించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గోల్కొండ కోటలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపనున్నారు. జూన్ 2, 3 తేదీల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఉండనున్నాయని. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. జూన్ 2 ఉదయం 7 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 3వ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకు ఫోటో పెయింటింగ్ పోటీలు జరుగుతున్నాయి. 2వ తేదీ సాయంత్రం నృత్యాలు, శంకర్ మహదేవన్, మంజులా రామస్వామి ఇన్ స్టిట్యూట్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండనున్నాయని తెలిపారు. అలాగే పలు రాష్ట్రాల రాజ్ భవన్ లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. రానున్న రోజుల్లో ఏ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా అన్ని రాజ్ భవన్ల లో వేడుకలు జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ నినాదంతో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో తెలంగాణ ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు.
అయితే నీళ్లు నిధులు నియమాకాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇన్నేళ్లలో ఏమి సాధించలేదని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తుంది. తెలగాణ ఏర్పడ్డాక అభివృద్ధిలో దూసుకువెళుతుందని బిఆర్ఎస్ అంటుంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్, అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజీపీలు ఉవ్విలూరుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాజకీయంగా వాడుకునేందుకు పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగా దశాబ్ది వేడుకలను వ్యుహాత్మకంగా వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గమని అనుకుంటున్నాయి. మరి ఇవి తెలంగాణ దశాబ్ది వేడుకలా..? లేక ఎన్నికల సమరభేరినా..? అని సామాన్యుడు ప్రశ్నించుకుంటున్నాడు.