Job Notifications: తెలంగాణలో భారీగా మరోసారి కొలువుల జాతర
Job Notifications: రాష్ట్రంలో కొనసాగుతున్న కొలువుల జాతరలో మరో ఏడువేల కొత్త పోస్టులు చేరాయి. ఇప్పటికే 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా, తాజాగా మరో 7,029 పోస్టులనూ వాటికి జతచేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మొత్తం 87 ,068 పోస్టులకు ఉత్తర్వులు ఇచ్చిందన్నమాట. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం పలుశాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా పోలీస్‌శాఖను మరింత పటిష్ఠం చేయాలని నిర్ణయించింది.
ఆర్‌అండ్‌బీ శాఖలో 472 పోస్టుల భర్తీతోపాటు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం లభించింది. పోలీసు శాఖలో మరో 3,966 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సైబర్ సేఫ్టీ బ్యూరోలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అంతేకాదు, డ్రగ్స్ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో 2,591 ఉద్యోగాల నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో అవసరమైన మేరకు నూతన నియామకాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.