Central Cabinet: సోయం బాపురావుకు కేంద్ర మంత్రి పదవి..?
Telangana BJP MP Bapurao likely to get Chance in Central Cabinet: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెలాఖరులో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆలోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది తెలంగాణతో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నందున ఈ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రాధాన్యం ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.
తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించటం ద్వారా కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల కలను కూల్చాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలంగాణకు చెందిన ఎంపీలకు ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడి ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు తోడుగా మరో ఎంపీకి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీకి ప్రస్తుతం నలుగులు ఎంపీల బలం ఉంది. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు లోక్‌సభకు, కె. లక్ష్ణణ్ రాజ్యసభ ఎంపీలుగా కొనసాగుతున్నారు. వీరిలో సోయం బాపూరావు మినహా మిగిలిన మగ్గురు ఒకే సామాజిక వర్గానికి (మున్నూరుకాపు) చెందిన వారు.
వారిలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సామాజికవర్గానికి కేంద్ర మంత్రి వర్గంలో మరో చోటు ఇచ్చే అవకాశాలు లేవని, సోయం బాపురావుకు మంత్రి పదవి దక్కుతుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా బాపురావుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్టీలను ఆకట్టుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16, 17 తేదీల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాల తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.