BRS Meeting At Khammam: బీఆర్ఎస్ సభకు ఆ పార్టీల దూరం ఎందుకు..?
Some Parties Away from BRS First Meeting in Khammam: బీఆర్ ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్‌తో జాతీయ స్థాయిలో ఉన్న విపక్షాలన్నీకలిసి రావడంలేదా? పలు ప్రధాన పార్టీలు ఆయనకు దూరంగా ఉంటున్నాయా? అంటే తాజా పరిణామాలను బట్టి నిజమేనన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్ గా మార్చిన సందర్భంలో ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభి్ంచినప్పడు, అంతకుముందు.. కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి గౌడ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాత్రమే కేసీఆర్ వద్దకు వచ్చారు. తాజాగా ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభకు అఖిలేశ్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌సింగ మాన్, కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్ హాజరయ్యారు.
కానీ, ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీని గట్టిగా ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ త్రుణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ నేత్రుత్వంలోని జేడీయూ, అదే రాష్ట్రానికి చెందిన ఆర్‌జేడీ, తటస్థంగా వ్యవహరిస్తున్న ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన వంటి పార్టీలు మాత్రం కేసీఆర్‌కు దూరంగానే ఉంటున్నాయి. వాస్తవానికి టీఆర్ ఎస్ పేరును బీఆర్ ఎస్ గా మార్చకముందు కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లి.. అక్కడి బీజేపీయేతర ముఖ్యమంత్రులను, ప్రధాన పార్టీల నేతలను కలిశారు. మమత, నితీశ్‌కుమార్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి వారి వద్దకు కేసీఆర్ స్వయంగా వెళ్లారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హైదరాబాద్‌కు వచ్చి మరీ కేసీఆర్‌ను కలిశారు. కానీ, తీరా కేసీఆరే జాతీయ పార్టీని పెట్టడంతో వీరంతా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
ఇందుకు కారణాలపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విపక్షాలకు తానే నాయకుడిని కావాలనే తలంపుతో కేసీఆర్ ఉన్నట్లు, తామంతా ఆయన వెంట నడిస్తే దీనికి తాము అంగీకరించారనే అభిప్రాయానికి వచ్చినట్లు అవుతుందనే దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ ఎస్ సభకు కేజ్రీవాల్ రావడాన్ని కూడా తెలంగాణలోని ఆప్ నేతలు తప్పుబట్టినట్లు సమాచారం. అయితే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి కేసీ ఆర్ ఆహ్వానించడం వల్లే వచ్చాను తప్ప.. ఖమ్మం సభ గురించి ముందుగా తనకు సమాచారం లేదని కేజ్రీవాల్ అన్నట్లు తెలిసింది. దీంతో మున్ముందు కేసీఆర్ వెంట ఉండేదెవరో, కొత్తగా వచ్చే వారెవరో అన్నది ఆసక్తికరంగా మారింది.