సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. తన చెల్లెలు మరో యువకుడితో పరారయింది. అదే సమయంలో వారింట్లోని కిచెన్‌లో మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కలకలం రేపింది.
Crime: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. తన చెల్లెలు మరో యువకుడితో పరారయింది. అదే సమయంలో వారింట్లోని కిచెన్‌లో మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కలకలం రేపింది.
కోరుట్లోని భీమునిదుబ్బ ప్రాంతంలో బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు దీప్తి బీటెక్ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం దీప్తి ఇంటి దగ్గరి నుంచే పనిచేస్తోంది. చిన్నకూతురు చందన కూడా బీటెక్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. వారి కొడుకు సాయి బెంగళూరులో డిగ్రీ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో ఫంక్షన్ ఉండడంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి వెళ్లారు. ఇంటి దగ్గర దీప్తి, చందన ఇద్దరే ఉన్నారు.
ఆరోజు రాత్రి పది గంటలకు శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లో తన కూతుళ్లతో మాట్లాడాడు. మరునాడు ఉదయం ఫోన్ చేస్తే.. దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయకపోవగా.. చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం కలిగి శ్రీనివాస్ పక్కింటి వారికి ఫోన్ చేశాడు. వారు వెళ్లి చూడగా.. సోఫాలో దీప్తి విగతజీవిగా పడి ఉంది. చందన కనిపించలేదు. ఈ విషయాన్ని శ్రీనివాస్‌కు తెలపడంతో.. హుటాహుటిన హైదరాబాద్ నుంచి తిరిగొచ్చారు. అటు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ఇళ్లు మొత్తం పోలీసులు తనిఖీ చేయగా.. కిచెన్‌లో రెండు మద్యం సీసాలు, కూల్ డ్రింక్ బాటిల్స్ లభ్యమయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చందన కోసం గాలించారు. కోరుట్ల బస్టాండ్‌లో ఉదయం 5 గంటల సమయంలో చందన మరో యువకుడితో ఉన్నట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత వాళ్లిద్దరు నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం వారిద్దరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
అయితే దీప్తి ఎలా చనిపోయింది?.. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి?.. చందన ఎవరితో పారిపోయింది?.. ఆ యువకుడికి చందనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. వారిద్దరే దీప్తిని హత్య చేసి పారిపోయారా?.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.