శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారటంమతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది.
Delhi liquor Scame: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor Scame)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు , అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Sarat Chandra Reddy) అప్రూవర్ (Aproovar) గా మారిపోయారు. తాను అప్రూవర్ గా మారిపోతున్నట్టు శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ (Petition) కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Delhi Court) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Mlc Kavita) మాజీ ఆడిటర్ బుచ్చిబాబు (Bucci Babu) అప్రూవర్‌గా మారారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు శరత్ రెడ్డి డైరెక్టర్ (Director) గా ఉన్నారు. ఈ సంస్థతో పాటు పలు సంస్థల్లో శరత్ చంద్రారెడ్డి పార్ట్ నర్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 2022 నవంబర్ 10వ తేదీన ఈడీ (ED)అధికారులు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి ముఖ్యుడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపణ. ఈ ఆరోపణలతో ఆయనపై పలు చార్జ్ షీట్లను ఈడీ దాఖలు చేసింది. సౌత్ గ్రూపు పేరుతో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లలో శరత్ చంద్రారెడ్డి అతిపెద్ద భాగస్వామి. ఢిల్లీ మద్యం వ్యాపారంలో 30 శాతం దుకాణాలను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ గతంలోనమోదు చేసిన ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. బినామీ కంపెనీలతో కలిసి 9 జోన్లలో శరత్ చంద్రారెడ్డి మద్యం వ్యాపారాన్ని నిర్వహించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేయడం కోసం డిజిటల్ సర్వర్లలో ఉన్న సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నించినట్టు ఈడీ తన రిపోర్టులో పేర్కొంది.
బెయిల్ పై శరత్ చంద్రారెడ్డి..
గత నవంబర్ నుంచి జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డికి మే 8 ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమె బాగోగులు చూసుకోవాలని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను పరిగణిస్తూ ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన అప్రూవర్ గా మారనున్న నేపథ్యంలో భద్రత పెంచాలని హోం శాఖ ఆదేశాలిచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్ గ్రూప్ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల, శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. తాజాగా శరత్ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారడంతో ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నాయని బీజేపీ ఆరోపణ. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి ఎవరి పేర్లు చెబుతారన్నదే ఆసక్తికరమైన అంశం.
అసలు కథ ఇప్పుడే.
శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం రాజకీయం ప్రకంపనలు మొదలవబోతున్నాయన్న అంచనాలున్నాయి. అరబిందో గ్రూప్ వ్యవస్థాపకుని వారసుడు అయిన శరత్ చంద్రారెడ్డి రాజకీయంగా కీలక సంబంధాలు కలిగి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డి. ఏపీ సీఎం జగన్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయన గతంలో దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు వెళ్లిన పారిశ్రామిక వేత్తల బృందంలో శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. అరబిందో రియాల్టీ పేరుతో హైరైజ్ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. అయితే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపి అవినాశ్ ను తప్పించటానికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. మే నెల చివర్లో ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో రాజకీయంగా అలజడి మొదలైంది.