Seethakka : సీతక్కకు తప్పిన పెను ప్రమాదం
Seethakka Narrowly Escaped from Accident : ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు వచ్చిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాలలో భారీ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వెళ్లారు సీతక్క. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం, ఎలిశెట్టి పెల్లిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తిరిగి పడవలో ఏటూరునాగారం వస్తున్న క్రమంలో వాగు దాటుతుండగా మార్గమధ్యంలో బోట్ లో పెట్రోల్ అయిపొయింది. వాగు ఉద్ధృతికి ఒక ప్రక్కకి పడవ కొట్టుకొని వచ్చి ఒక చెట్టును డీ కొని ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకున్న సీతక్క అందులో నుండి దిగి, ఒడ్డుకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. పడవలో ఉన్న ఎవరికి కూడా ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా తెలంగాణలో శనివారం కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వర్షాలతో, నగరంలో ఉష్ణోగ్రతలు చాలావరకు పడిపోయాయి. గరిష్టంగా 29.2 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22.4 డిగ్రీల సెల్సియస్ ఉండడంతో నగరం సాధారణం కంటే చల్లగా మారింది. రాబోయే 48 గంటలలో హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉండడం, లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లో అలెర్ట్ అంటే 7-15 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది.