Medico Preethi: ప్రీతిని ర్యాగింగ్ చేశా.. విచారణలో సైఫ్ అంగీకారం
Saif accepted that he did ragging to Medico Preethi
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రీతిని తాను ర్యాగింగ్ చేశానని సైఫ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
మెడికో ప్రీతి మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రీతిని ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశగా విచారణ జరపాలని కోరారు. పోలీసులు కూడా తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ప్రీతి అపస్మారకస్థితిలోకి వెళ్లిన కొన్ని గంటలకే పోలీసులు సైఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో విచారణ చేశారు. తాజాగా తాను ప్రీతిని ర్యాగింగ్ చేశానని సైఫ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ గా ఆమెను గైడ్ చేశానని, ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని గతంతో వాదించిన సైఫ్ ప్రస్తుతం అన్ని విషయాలు ఒప్పుకుంటున్నట్లు తెలిసింది.
మెడికో ప్రీతి ఫిబ్రవరి 22న అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆరు రోజుల పాటు చావుతో పోరాడి ఫిబ్రవరి 26న మరణించింది.