Nizamabad: ఆ ఊళ్ళో ఆడపిల్ల పుడితే రూ.5000 సాయం
Nizamabad: ఆడపిల్ల పుట్టింది అనే నిట్టూర్పులు. అందరూ ఆడపిల్లలయితే ఏం పెట్టి పెద్ద చేయాలి అనే నిష్టూరాలు .. ఆడపిల్లలు ఉన్నోడు అష్ట దరిద్రుడే అనే సూటిపోటి మాటలు.. బిడ్డల పెళ్లిళ్లు చేయలేక తల్లితండ్రుల ఆవేదనలు.. ఈ మాటలు ఇంకెంత కాలం వినాలి. అమ్మాయి పుడితే అరిష్టం అని ఇంకెన్నాళ్లు నమ్మాలి. పురిట్లో శిశువుని దూరం చేయడం. వంటివి ఎన్నో సమాజంలో చూస్తుంటాం. కానీ ఓ చోట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి గా భావిస్తున్నారు.
డిచ్ పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి రూప ఆడపిల్లకు పెద్దపీట వేస్తున్నారు ఆ గ్రామంలో. ఆడపిల్ల పుడితే అదృష్టం గా భావించాలని ముందడుగువేశారు. ఆడపిల్ల పుడితే భయపడే వారికీ భయాన్ని దూరంచేస్తున్నారు. అలాంటి వారికీ చేదోడుగా మారుతున్నారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే 5000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అయితే అవి తల్లి తండ్రుల చేతికి ఇవ్వకుండా ఆడపిల్ల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేసి బాండ్ రూపంలో అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 26 నుండి..వచ్చేఏడాది జనవరి వరకు కొనసాగుతుందని చెప్పారు. ఏటా 20 లోపు మాత్రమే ఆడపిల్లలకు సంబదించిన జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుంటామని స్పష్టం చేసారు.