Rewanth Reddy: రేపు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి
In favor of Army candidates: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు చంచల్ గూడా జైలుకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథాకానికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని అరెస్టు అయిన ఆర్మీ అభ్యర్థులతో ములాఖత్ కానున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన యువకులకు ధైర్యం చెప్పనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్‌లో జరిగిన హింసాకాండలో అరెస్టు అయిన వారికోసం కాంగ్రెస్ పార్టీ లాయర్లను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 27న కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ నేతలు కోరారు.
ఇటీవల అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఒక్కసారిగా వేలసంఖ్యలో యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ముందుగా అక్కడ రైళ్లను వెళ్లకుండా అడ్డుకున్న యువకులు రైల్వే స్టేషన్‌లో ఉన్న షాప్‌లను, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వారు తీసుకువచ్చిన పెట్రోల్‌ను ప్లాట్‌పారంపై ఆగివున్న ట్రైన్‌లో పోశారు అనంతరం ఆ ట్రైన్‌కి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 12 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.