టీఆర్‌ఎస్‌కు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్
ఇవాళ జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 24 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలన్న రేవంత్.. లేకుంటే రాష్ట్ర మంత్రులను, టీఆర్‌ఎస్ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించాలన్నారు.
ధాన్యం సేకరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్, బీజేపీ ప్రభుత్వాల నాటకాలను త్వరలోనే బయటపెడుతామన్నారు. సీఎం కేసీఆర్ రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే అన్నదాతల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మరోవైపు నిన్న ఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతలు.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నిరసన దీక్షలో సీఎం మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలు సమయం ఇస్తున్నామని ఆలోగా ప్రభుత్వం ధాన్యంపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేయాల్సింది చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.