కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలతో పాటు ఈటల రాజేందర్‌కు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. అవసరమైతే 10 మెట్లు దిగుతానని ప్రకటించారు. మరి రేవంత్ పిలుపు మేరకు నేతల ఘర్ వాపసీ ఉంటుందా..? లేదంటే రేవంత్ పిలుపు కాంగ్రెస్2ను బలహీనం చేస్తుందా..?
REVATNH GHAR WAPASI : కర్ణాటక ఎన్నికల ఫలితాల(Karnataka Election Results) జోష్‌లో ఉన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (PCC President Revanth Reddy) ఇక్కడ కూడా అవే ఫలితాలు రాబడతామని ధీమాగా చెబుతున్నారు. అందుకోసం 10 మెట్లు కూడా దిగుతాను కలిసి పనిచేద్దాం రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. హస్తం పార్టీ(Congress Party) నుంచి బీజేపీలో చేరిన నేతలతో పాటు బీఆర్ఎస్, కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నవాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తామంటున్నారు. వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి తదితర నేతలందరినీ పార్టీలోకి రావాలాని బహిరంగంగా పిలుపునిచ్చారు. వాళ్లందరికీ బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌లోకి రండి కేసీఆర్‌ను ఓడించండి అని నినాదం అందుకున్నారు. కర్ణాటక ప్రజా తీర్పును దేశమంతా స్వాగతిస్తుంటే.. పట్టించుకోవాల్సిన పనిలేదని కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ-బీఆర్ఎస్, మోడీ-కేసీఆర్ వేర్వేరు కాదని మండిపడ్డారు. అయితే రేవంత్ పిలుపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనతకు నిదర్శనమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
దిగే 10 మెట్లు ఏంటి..?
రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ కొందరు కాంగ్రెస్ పార్టీని వీడారు. అలాగే కాంగ్రెస్ మూలాలు లేని వ్యక్తికి పీసీసీ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే కారణంతో రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. పీసీసీ కోసం గట్టిగా ప్రయత్నించినా నిరాశే ఎదురవడంతో బీజేపీలో చేరారు. అలాగే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మరికొందరు సీనియర్లు కూడా రేవంత్‌పై సమయం వచ్చినప్పుడల్లా గళమెత్తుతున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వీహెచ్ తదితరులు బహిరంగంగానే విబేధిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ పిలుపుతో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి వస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే పీసీసీ కూడా వదులుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
సీఎం పదవి తీసుకోరా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక తరహాలోనే ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉంది. సీఎం పదవి వ్యవహారం తేల్చేందుకు కాంగ్రెస్ పెద్దలకు దాదాపు వారం రోజులు పట్టింది. తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తరహాలోనే అక్కడ డీకే శివకుమార్ పీసీసీగా ఉన్నారు. దూకుడుగా పనిచేసి పార్టీకి విజయం చేకూర్చారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య తరహాలోనే ఇక్కడా సీనియర్లు సీఎం రేసులో ఉన్నారు. ఒకవేళ విజయం సాధిస్తే కన్నడ ఫార్మూలా తరహాలోనే తాను కూడా సీఎం పోస్టు తీసుకోనని రేవంత్ సంకేతాలిచ్చారా అనే చర్చ జరుగుతోంది. డీకేలాగే రేవంత్ కూడా రాహుల్ ఆశీస్సులతోనే పీసీసీ పీఠం అధిరోహించారు. అతని లాగే విధేయత చాటుకునేందుకు రేవంత్ సిద్ధపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది.
ఘర్ వాపసీ సాధ్యమేనా..?
రేవంత్ పిలుపు మేరకు తిరిగి సొంత గూటికి వచ్చినా మళ్లీ ఇక్కడ ఇమడ గలరా అనే సందేహాలు వస్తున్నాయి. అలాగే ఒకసారి వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ తమకు తగిన గౌరవం ఉంటుందా అనేది అనుమానమే. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా తెలంగాణలో హస్తం పార్టీ గెలిచే అవకాశాలు అంత సునాయాసం ఏమీ కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. కర్ణాటకలో బీజేపీని ఓడించినంత సులువుగా ఇక్కడ కేసీఆర్‌ను ఎదుర్కోవడం అంత లేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కుమార స్వామి కంటే ఇక్కడ బీజేపీ కూడా బలపడుతోందనే చర్చ ఉంది. అలాగే మజ్లిస్ కూడా బీఆర్ఎస్తో కలిసి వెళ్తోంది. వామపక్షాలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ అన్ని అంశాలు బేరీజు వేయకుండా రేవంత్ రెడ్డి రమ్మనగానే పొలోమని వస్తారా అనే సందేహాలు వస్తున్నాయి.
రాజగోపాల్ రెడ్డి ఏమన్నారు..?
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. మరో 6 నెలల్లో ఎన్నికలు ఉండగా బీజేపీని బలహీనం చేసేలా కుట్రలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలు చూసి నా మిత్రులు కొందరు కాంగ్రెస్ లోకి రమ్మని అడుగుతున్నారు. బీజేపీని వీడుతున్నట్లు తప్పుడు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి 20 ఏళ్లు టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన కింద ఎలా పనిచేయాలి? కేసీఆర్‌ను గద్దె దించేందుకే బీజేపీలోకి వచ్చాను. కర్ణాటక, తెలంగాణలో ఒకే తరహా పరిస్థితులు లేవు. గెలవక ముందే తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాదు పారదర్శకంగా నా కంపెనీకి టెండర్ వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది. దుష్ప్రచారం చేస్తే బయపడే వ్యక్తని కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.