Revanth Reddy: భద్రాచలం నుంచే రేవంత్‌రెడ్డి పాదయాత్ర
Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు వాడి వేడిని తలపిస్తున్నాయి. ఒకరినొకరు దూషించుకునే స్థాయి నుండి..పాదయాత్రలవరకు వెళుతున్నారు. తెలంగాణాలో బండిసంజయ్,షర్మిల,ప్రవీణ్ కుమార్ లు పాదయాత్ర చేసారు. తాజాగా కాంగ్రెస్ కూడా పాదయాత్రకు సిద్దమవుతుంది. జనవరి 26న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర చేపట్టాలని హస్తం నేతలు తీర్మానించారు.
రాష్ట్రంలో చేపట్టే తీరుపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సమావేశమైన నేతలు జనవరి 26న హాత్ సే హాత్ జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు యాత్ర చేపట్టాలని తీర్మానించారు. తెలంగాణలో యాత్ర ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ లేదా ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తూ తీర్మానం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి యాత్ర ప్రారంభిస్తానని అన్నారు. ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీలు ఒకరోజు యాత్రలో పాల్గొనేలా కోరతామన్నారు. రేవంత్ రెడ్డి కనీసం 50 నియోజకవర్గాలకు తగ్గకుండా పాదయాత్ర చేయబోతున్నారు. మిగతా సీనియర్లు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పాద యాత్ర చేపట్టాలని నేతలు ఠాక్రేసూచించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతలంతా కలిసి పనిచేయాలని యాత్రను విజయవంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.