Revanth Reddy Comments on KCR: ఏక్నాథ్ షిండేలకు గాడ్‌ఫాదర్ కేసీఆర్: తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదికారిగా మారిన నరేంద్రమోడీకి కేసీఆరే ఆదర్శమని ఆరోపించారు. ఏక్నాథ్ షిండేల ఉత్పత్తిని ప్రారంభించింది కేసీఆరేనని విమర్శించారు. విషపు పరుగులను తయారు చేసి ఊరు మీదకు వదులుతున్నది నువ్వే కదా అంటూ సీఎం కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీలో లేని తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిని చేసింది నువ్వే కదా అని మండిపడ్డారు. ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి లాంటి ఏక్నాథ్ షిండేలను తయారు చేసిందే నువ్వ కదా అంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నీవరకు వస్తే గానీ తెలియలేదా? అంటూ ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరిద్దరే
రాజీవ్ గాంధీ మొదలు కొని వాజ్‌పేయ్ వరకు పార్టీ ఫిరాయింపులను నిలువరించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నరేంద్ర మోడీ, నువ్వు ఏం చేశారని కేసీఆర్‌ను, రేవంత్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరిద్దరే కదా అంటూ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ని, సీపీఐ నుంచి ఎన్నికైన రవీంద్ర నాయక్‌ను పార్టీలో కలుపుకున్నది నువ్వే కదా అంటూ గుర్తుచేశారు. ఎర్రజెండాకు కూడా తుప్పు పట్టించినది నువ్వే కదా అంటూ ఛలోక్తులు విసిరారు.
ముసలి నక్క, నాన్‌వెజ్ బంద్
కేసీఆర్ మాటలు వింటుంటే, నక్క ముసలిది అయ్యాకా నాన్ వెజ్ బంద్ చేసినట్లు ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రలకు పోయి నీతి కథలు చెప్పిందట అంటూ సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ మంత్రి వర్గం మొత్తం ఏక్నాథ్ షిండేలే కదా అంటూ చమత్కరించారు. ప్రస్తుతం నీ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్లు మంత్రివర్గంలో ఎవరున్నారంటూ ప్రశ్నించారు. మంత్రి వర్గంలో ఉన్నది అంతా తెలంగాణ ద్రోహులే కదా అంటూ విమర్శించారు. కేకే, నామా నాగేశ్వరరావులు నీ పార్టీలో పుట్టారా అంటూ ప్రశ్నించారు.