Revanth Reddy: ప్రశ్నాపత్రం లీకేజీ అసలు హానీ ట్రాపా.. హ్యాకింగా.. లీకేజీనా?
Revanth Reddy: తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చుట్టూనే తిరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడి వారికే దక్కాలని యూనివర్సిటీల నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని, కానీ ఆ ఉద్యమాన్ని కేసీఆర్ రాజకీయ ఉపాధిగా మలచుకున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను నమ్మించారని, 1200 మంది అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. 1లక్షా 50వేల ఖాళీలను భర్తీ చేస్తామని మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించారని, తొమ్మిదేళ్లయినా ఆ హామీని కేసీఆర్ నేరవేర్చలేదని అన్నారు. నిరుద్యోగుల నిరసన తెలపకుండా ధర్నా చౌక్ రద్దు చేశారన్న ఆయన తెలంగాణ వచ్చాక 2వేల మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, ఇవన్నీ కేసీఆర్ పాల్పడిన హత్యలే అని అన్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు ఎలా లీక్ అయ్యాయో చైర్మన్ , సీఎం, వివరణ ఇవ్వలేదని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. 30లక్షల మంది నిరుద్యోగుల వివరాలు దాచిపెట్టాలని చూసిందని, ఈ టీఎస్పీ ఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆయన అన్నారు. ఇప్పుడు లీకేజీలతో అభ్యర్థులను గందరగోళం లోకి నెట్టారని, గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు గందరగోళంలో పడిపోయారని, టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్ రూమ్ లోకి ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లారు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఏ పోటీ పరీక్ష కూడా పారదర్శకంగా నిర్వహించడం లేదన్న ఆయన ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలోను తప్పులు జరగడంతో 24 మంది విద్యార్థులు మరణించారని, ఇది సీఎం కేసీఆర్ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. టీఎస్ పీఎస్సీ వ్యవహార శైలి లోపభూయిష్ఠంగా కనిపిస్తోందని, టీఎస్ పీఎస్సీ ఉనికి ప్రశ్నర్ధకంగా కనిపిస్తోందని అన్నారు. లీకేజీల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్న రేవంత్ తెలంగాణ వచ్చాక ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలపై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని అన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారంలో పాత్ర లేదని నిరూపించుకోవాలని డిమాండ చేసిన ఆయన పెద్దలను కాపాడేందుకే దీనిపై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని అన్నారు. ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సూమోటోగా స్వీకరించి విచారణ చేయొచ్చని పేర్కొన్న ఆయన 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ తేల్చిందని, నియామకాలు చేపట్టాల్సిన టీఎస్పీఎస్సీలో 400 మంది ఉద్యోగులకు కేవలం 80 మంది ఉద్యోగులే ఉన్నారని అన్నారు. ఇది కేసీఆర్ నిర్లక్ష్యానికి ఒక స్పష్టమైన ఉదాహరణ అని, ప్రశ్నాపత్రం లీకేజీ అసలు హానీ ట్రాపా.. హ్యాకింగా.. లీకేజీనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని రేవంత్ అన్నారు.