Revanth Reddy: రేవంత్ వాహనంపై టమోటాలు, గుడ్లతో దాడి?
Revanth Reddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ వాహనంపై టమోటాలు, గుడ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు సభ వద్దకి దూసుకెళ్లే యత్నం చేయగా అడ్డుకొని స్థానిక సినిమా థియేటర్ లో బంధించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. భూపాలపల్లి ఘటనలో రేవంత్ మాట్లాడుతూ నాపై టమాటాలు కోడిగుడ్డు వేయడం కాదు, దమ్ముంటే నువ్వు ఇక్కడికి రా నేను తలుచుకుంటే.. నీ ఇల్లు కూడా ఉండదని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీకి చెబుతున్నా గండ్ర నీకు చుట్టం కావచ్చు, కానీ నీ గుడ్డలు ఊడే సమయం వచ్చిందని అన్నారు. ఎస్పీ నీకు అధికారం శాశ్వతం అనుకుంటున్నావు, మేము సభలు పెట్టుకుంటే ఆవారా గాళ్ళు దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ ఉంది అంటే మేము ఓ రోజు వాయిదా వేసుకున్నామని అన్నారు. కానీ మీరు దాడులు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు రెండు సార్లు అవకాశమిచ్చారు. మరో సారి అవకాశమిచ్చి మోస పోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం పరిధిలోని కాశీంపల్లి గ్రామం నుంచి భూపాలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర్యం కోసం పదేళ్లు జైళ్లో ఉన్నారు. ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలార్పించారు. రాజీవ్ గాంధీ గారు..18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించడంతోపాటు దేశానికి కంప్యూటర్లను పరిచయం చేశారు. ఆయన కూడా దేశసేవలో ప్రాణాలు విడిచారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు.. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం కోసం, ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉజ్జ్వల భవిష్యతు ఉంటుందని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశంతో ఈ నెల 6న మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించాను.
కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. పోలీసుల అండతో కొంత మంది మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా… ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నవా? నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేద్కర్ చౌరస్తాకు రా నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతం. గత 23 తారీఖున మా సభతోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ కూడా ఉంది. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదనే విజ్ఞతో మేం ఆ రోజు సభ పెట్టలేదు. ఇవాళ ఆవారా గాళ్లు దాడులుచేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? ఎస్పీ ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా? అధికారం శాశ్వతం కాదు అనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలి.