కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది
Revanth Reddy : కర్ణాటక (Karnataka) అసెంబ్లీ (Assembly) ఎన్నికల (Election) ఫలితాలు (Results) తెలంగాణ (Telangana) కాంగ్రెస్ (Congress)లో ఊహించినట్టే ఉత్సాహాన్నిపెంచుతున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్తో పోరాడుతున్న రేవంత్, కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్లపై స్వరం పెంచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని, ఏ ఇద్దరు చూసినా కర్ణాటక ఫలితం గురించే చర్చించుకుంటున్నారని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్ని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి వివరించారు.
ఇదే నా ఆహ్వానం …. కలసి రండి
ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా రేవంత్ అడుగులేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పునరేకీకరణ అవసరాన్ని రేవంత్ గుర్తు చేశారు. అందులో భాగంగా సీనియర్లకు ఆహ్వానం పలికారు. కలసి పనిచేస్తే కాంగ్రెస్కు మళ్లీ స్వర్ణయుగం వస్తుందన్న రీతిలో పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయిన చాలా మంది సీనియర్లు పునరాలోచనలో పడ్డారని రేవంత్ అన్నారు. వివేక్, ఈటల, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నేతలందరినీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని ఆహ్వానిస్తున్నాని ప్రకటించారు. పార్టీని వీడిన సీనియర్లందరికీ కాంగ్రెస్ అమ్మలాంటిదన్నారు. బీజేపీ వాళ్లను నమ్మదని, వాళ్లు బీజేపీని నమ్మరని
రేవంత్ అన్నారు.
పార్టీ కోసం పదిమెట్లు దిగటానికి సిద్ధం
ఎవరికైనా తనతో ఇబ్బంది ఉంటే నిర్మొహమాటంగా చెప్పొచ్చన్నారాయన. నన్ను ఎవరు తిట్టినా ఫర్వాలేదని, తాను ప్రజల మనిషినని, పార్టీ కోసం పదిమెట్లు దిగటానికి సద్ధమని రేవంత్ ప్రకటించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా ఏకం కావటానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. నేను పార్టీ మనిషినన్న అంశాన్ని మరో సారి గుర్తు చేస్తూ.. తాను కూడా ఖర్గే నాయకత్వంలో పని చేస్తున్నానన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు.
కొత్త వారికీ ఆహ్వానం
పాతవారినే కాదు .. పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామన్నారు రేవంత్ ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పొంగులేటి, జూపల్లి లాంటి నేతలంతా కలసిరావాలని రేవంత్ కోరారు. తన వల్ల ఇబ్బందులేమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల నిర్మొహమాటంగా మాట్లాడొచ్చని రేవంత్ సలహా ఇచ్చారు. తానూ ఓమెట్టు దిగి వస్తానన్నారు.
నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ
కర్ణాటకలో జేడీఎస్ కోసం కేసీఆర్, బీజేపీ కోసం మోడీ పని చేశారని అయితే ప్రజలు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారని రేవంత్ అన్నారు. మొన్న కర్ణాటకలో గెలిచినట్టే తెలంగాణలోనూ కాంగ్రెస గెలుపు ఖాయన్నారు.
నెక్ట్స్ కేంద్రంలోనే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అంటున్నారు రేవంత్. ఇదే ఉత్సాహంతో పని చేస్తే అందరూ ఒక్కటైతే కేంద్రంలో బీజేపీ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ అధికారం చేపడుతుందనడంలో సందేహం లేదని అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తుకునేదని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వాళ్లతో ఉన్నది కాంగ్రెస్సేనన్నారు. కేంద్రంలో కేసీఆర్ను మంత్రిని చేసిన విషయం గుర్తు చేసుకోవాలని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని ఇవన్నీ చేసిన కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసినట్టు ఎట్లా అవుతుందన్నారు.
త్వరలో బీసీ పాలసీ
త్వరలో బీసీ పాలసీని ప్రకటించబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలంటే అడ్డుకున్నదెవరో గుర్తుతెచ్చుకోవాలన్నారు. పదవి పోయే ముందు మోడీకి బీసీలు గుర్తుకొచ్చారని, కేంద్రంలో బీసీమంత్రి ఎందుకు లేరని రేవంత్ ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేసింది బీజేపీనేనని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇద్దరి మాటలూ ఒకేలా…
కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి తాము అలాంటి సానుకూల స్పందన ఆశించడంలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా తాము కోరుకోవడంలేదని తెలిపారు. కానీ, కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించి, ప్రజలు ప్రజస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకునే మాటను కేసీఆర్ అనుంటే ఎవరైనా ఆయను అభినందించేవారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనను అభినందించకపోయినా కనీసం తిట్టుండే వాళ్లు కాదని తెలిపారు. “కర్ణాటకలో ఫలితాలు వచ్చిన మొదటి రోజే బండి సంజయ్ ఏం చెప్పాడో చూడండి… కర్ణాటక ఫలితాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నాడు. కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపించవన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది అన్నాడు. బండి సంజయ్ ఈ మాటలు చెప్పిన నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ కూడా ఇవే మాటలు చెప్పాడు. అక్కడ మోదీ ఓటమిని గుర్తించడానికి కూడా కేసీఆర్ కు మనసొప్పలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే… బీజేపీ భాషను, బండి సంజయ్ వ్యాఖ్యలను కేసీఆర్ స్పష్టంగా సమర్థించాడు. ఇన్నాళ్లూ కేసీఆర్ ఏంచెప్పాడు… మోదీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాడు, మోదీపై కొట్లాడతాం అన్నాడు. మోదీకి ఎదురొడ్డి నిలుస్తాం అని చెప్పిన విధానానికి, నిన్న ఆయన మాట్లాడిన విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ మాటలను ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ సమాజం దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.