తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్ల సేల్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Beer sales: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్ల సేల్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ అందులోను సూరీడి భగ భగలు ఇంకేముంది ఎర్రమందుతాహేకన్నా కడుపు సల్లపరుచుకుందామనుకుని ప్రతిఒక్కరు బీర్ తాగడానికే మొగ్గుచూపుతున్నారు. పెండ్లీలతోపాటు ఇతర ఫంక్షన్లు కూడా ఉండడం బీర్ల అమ్మకాలకు కలిసొచ్చింది. రాష్ట్రంలో 2,650 వైన్స్ షాపులుండగా, వీటి పరిధిలో 19 లిక్కర్ డిపోలు నడుస్తున్నాయి.
ఈ నెల 1 నుంచి 18 తేదీ వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో ఎక్కువ శాతం బీర్లే అమ్ముడయ్యాయని ఆబ్కారీ శాఖ తెలిపింది. మే నెల 1 నుంచి 18 తేదీ వరకు 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి. అంటే సగటున రోజుకు 1,95,847 కాటన్ల బీర్లు తాగేశారు. ఒక్కో కాటన్‌కు 12 బీర్ల చొప్పున లెక్కిస్తే సగటున రోజుకు 23,50,164 బీర్లు సేల్స్ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీర్లను తాగేశారు. బీర్ల సేల్స్ ద్వారా సర్కార్‌కు వచ్చిన ఆదాయం రూ.582.99 కోట్లు. బీర్ల అమ్మకాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలువగా కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో 3,00,364 కాటన్ల బీర్లు అమ్ముడవగా, రూ.48.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్లకు ఇంకా డిమాండ్ పెరిగే అవకాశముందని అధికారులు చెపుతున్నారు.