TSRTC Record: టీఎస్‌ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ..గతేడాది కన్నా 62.29 కోట్లు అదనపు ఆదాయం!
TSRTC Record: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం, టోల్‌ప్లాజాల టీఎస్‌ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారని ప్రకటనలో టీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 10 నుంచి 20 తేదీ వరకు.. 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్‌ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని, గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారని పేర్కొన్నారు.
సంక్రాంతికి 11 రోజుల్లో మొత్తంగా రూ.165.46 కోట్ల ఆదాయం రాగా గత ఏడాది సంక్రాంతి కంటే ఈ సారి రూ.62.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. కిలోమీటర్ల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో సంక్రాంతికి 3.57 కోట్ల కిలోమీటర్ల మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరిగాయని, గత ఏడాదితో పోల్చితే 26.60 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు తిరిగాయని ప్రకటించారు. ప్రతి రోజూ సగటున 2.42 లక్షల కిలోమీటర్లు అదనంగా బస్సులు నడిచాయని, ఈ క్రమంలో ఈ సారి బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగిందని ప్రకటించారు. గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 59.17గా ఉంటే ఈ సంక్రాంతికి అది 71.19కి పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఈ స్పందన వల్ల తమ సంస్థపై బాధ్యత మరింత పెరిగిందని సజ్జనార్ అన్నారు.