Rajagopal Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
Rajagopal Reddy Comments on KCR : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆయన అమిత్ షాని కలవడంతో పార్టీ మారతాడు అని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ షాని కలిసింది వాస్తవమని, రాజకీయాలు అమిత్ షా తో చర్చ కు రాలేదని, తెలంగాణ ఉద్యమంలో తాను చేసిన పోరాటంపై చర్చ జరిగిందని, ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏంటి అనే విషయంపై చర్చ జరిగిందని, నాలుగు లక్షల కోట్ల అప్పులకు దిగజారిందని వెల్లడించారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది ? అని అమిత్ షా అడిగారని అన్నారు. ఉద్యమం చేసిన తమ లాంటి వాళ్ళు గౌరవం ఉన్నచోట పని చేయాలని కోరుకుంటామని, పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నప్పుడు తానే చెప్తానని అన్నారు. కేసిఆర్ లెక్క కేంద్రంలో ఉండదని, ఇతర పార్టీ నాయకులకు అప్పాయింట్ మెంట్ ఇవ్వకూడదని కేంద్రం అనుకోదని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీ, అమిత్ షా అనుకుంటే టీఆర్ఎస్ ని ఓడిస్తారని ప్రజలు నమ్ముతున్నారని, సాధు జీవి లాంటి కాంగ్రెస్ ని బొంద పెట్టీ, పులి లాంటి బీజేపీని కోరి తెచ్చుకున్నారు కేసిఆర్ అని అప్పట్లోనే చెప్పానని గుర్తు చేశారు.
ఇక తన విషయానికొస్తే సోనియా గాంధీకి వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ ని వ్యతిరేకించను అని, ఒకవేళ పార్టీ మారాలని అనుకుంటే రాజీనామా చేసి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి క్షమాపణ చెప్పి వెళ్తానని క్లారిటీ ఇచ్చిన ఆయన రాజీనామాతోనే నియోజక వర్గ అభివృద్ధి జరుగుతుంది అంటే దళిత బందు ఇచ్చినప్పుడే తాను రాజీనామా చేస్తా అని ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తనను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీలో ఎన్నోసార్లు మాట్లాడానని, కేసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోయినా, అసెంబ్లీ లో కలిశానని గుర్తు చేసుకున్నారు. శివన్న గూడెం ప్రాజెక్టు ముంపు రైతులకు మల్లన్న సాగర్ కి ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వండి అంటే కూడా స్పందించలేదని, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కు మాత్రమే నిధులు వెచ్చిస్తున్నారని, ఉప ఎన్నికలు వచ్చిన నియోజక వర్గంకే నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. మునుగోడు తెలంగాణలో లేదని, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ వాళ్ళే ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు.
దుర్మార్గంగా ఎన్నికలు గెలవడమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యే లను కొని, ప్రశ్నించే గొంతుని తుంచే పనిలో ఉన్నాడు అంటూ కేసిఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో కొందరు తనంటే గిట్టని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారని, ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదని, రాజీనామా చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బీజేపీ బలపడే అవకాశం ఉందని చెప్పానని, రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తాను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్దికి ఓటేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కి ఎప్పుడు తాను వ్యతిరేకంగా పని చేయలేదని, కేసిఆర్ పై సరిగా ఉద్యమం చేయడం లేదని, తెలంగాణకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను ముందు పెట్టినా, మూడేళ్లు సైలెంట్ గా ఉన్నానని, కేసిఆర్ ని బొంద పెట్టే సమయం ఆసన్నమైందని విమర్శించారు. కేసిఆర్ కి వ్యతిరేకంగా బలంగా పని చేస్తే దానితో కలిసి పని చేయాలని కోరిక ఉందని, తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మనుషులనే కాదు భద్రాచలం రామున్ని కూడా మోసం చేశారు… భద్రాచలం లో రాముడికి 100 కోట్లు ఇస్తా అని ఆయన్ని కూడా మోసం చేశారని, తాను పార్టీ మారాల్సి వస్తే తన భువనగిరి, మునుగోడు ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకుంటానని, కేసిఆర్ ఉసి గొలిపితే ఎన్నికలకు పోనని, కేసిఆర్ ట్రాప్ లో పడబోనని అన్నారు.