Komratireddy Raja Gopal Reddy: తెలంగాణ బీజేపీలో కలకలం మొదలైంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ నేతల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ కు కాలం కలిసి వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ ను వీడిన నేతలు పునరాలోచనలో పడ్డారు. బీజేపీ వైపే చూసిన నేతలు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఈ లిస్టులో వినిపిస్తోంది. తన అనుచరులతో తిరిగి కాంగ్రెస్ లో చేరే అంశం పైన చర్చలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్ కు కలిసొస్తున్నాయి. నల్గొండ జిల్లాలో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసారు. రాజగోపాల్ పైన టీఆర్ఎస్ అభ్యర్ది ప్రభాకర రెడ్డి విజయం సాధించారు. బీజేపీలో కొంత కాలంగా నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించినా పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలోనే కొత్తగా చేరిన నేతలకు ప్రాధాన్యత దక్కటం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకుంటుందనే వాదన మొదలైంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి చేరే అంశం పైన తన అనుయాయులతో చర్చలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చర్చల్లో ఆయన కాంగ్రె్‌సలో చేరడం వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే, రేవంత్ క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారని పేర్కొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత బీజేపీ మరింత బలహీనంగా మారిందని, తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే ప్రసక్తి లేదని రాజగోపాల్ తన అనుయాయులతో అభిప్రాయపడినట్లు సమాచారం. మరో ఆరు నెలల్లోనే ఎన్నికలున్న నేపథ్యంలో పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని వివరించారు. కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటున్న కారణంగా వేరే పార్టీలవారెవరూ బీజేపీలో చేరబోరని చెప్పారు.
జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ గ్రాఫ్ కూడా పడిపోతున్నదని వివరించినట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేశారు. అయితే, బీజేపీ దయాదాక్షిణ్యాలతోనే తనకు టెండర్ దక్కిందన్న ఆరోపణలను రేవంత్ వెనక్కు తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్తే అప్పుడు కాంగ్రెస్ లో చేరే విషయమై ఆలోచించవచ్చునని రాజగోపాల్ అనుయాయులకు చెప్పారని తెలుస్తోంది. రేవంత్ ఇందుకు సానుకూలగా స్పందిస్తే రాజగోపాల్ తన వైఖరిపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తే నైతికంగా బీజేపీ పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పార్టీలో ముఖ్య నేతల చేరికలు ఉంటాయని చెబుతున్న సమయంలో..వచ్చిన నేతలే పార్టీని వీడితే ఖచ్చితం గా ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో రాజగోపాల్ కు పార్టీలోనే కీలక బాధ్యతలు అప్పగించి బీజేపీలో కొనసాగేలా ప్రయత్నాలు సాగుతున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. తెలంగాణ లో 105 సీట్లు గెలుస్తామంటూ అటు కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీలో పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పు పైన బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.