Weather Alert : మరో మూడు రోజులు ఇంతే
Rains in Telangana for next three days : తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్నటి ఆవర్తనం ఈరోజు కూడా ఆగ్నేయ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి, ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశ వైపుకి వంపు తిరిగి ఉండడంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
నారాయణపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్గొండ, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం భద్రాచలంలో అత్యధికంగా 26 మి.మీ, హన్మకొండ (4 మి.మీ), ఆదిలాబాద్ (2 మి.మీ) వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం హైదరాబాద్లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. కాగా నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ నుండి 31 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ నుండి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.