Telangana : మరో మూడు రోజులు వర్షాలు… వాతావరణ శాఖ హెచ్చరిక
Rains for three more days in Telangana : రాష్ట్రంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయం అయ్యాయి. ఇక రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో బుధవారం కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఈ రోజు, రేపు తెలంగాణలో అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా కొన్ని చోట్ల తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ఈ రోజు దక్షిణ ఒరిస్సా తీరం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనాన్ని అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. ఈరోజు తెలంగాణలో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గాలి వేగం గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.