Rains: రేపటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు
Rains: భగభగ మండే ఎండలు కాస్తున్నవేళ తెలంగాణ ప్రజలకు తీపి కబురుచెప్పింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి, కరీంనగర్‌లలో కూడా వర్షాలు మరింత భారీగా కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ వివరించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం నాడు 39 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.