Medico Preeti Case: ర్యాగింగ్ వల్లే ప్రీతీ ఆత్మహత్య చేసుకుంది.. యాంటీ ర్యాగింగ్ కమిటీ
Medico Preeti Case: సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ ఫస్టియర్ అనస్థీషియా విద్యార్థిని ధారావత్ ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని విచారణ కమిటీ నిర్ధారించింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 16న హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రివెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన వాగ్వాదమే ఇద్దరి మధ్య వివాదానికి కారణమని కమిటీ నిర్ధారించింది. మానసిక వేధింపులు కూడా ర్యాగింగ్ కిందకే వస్తుందని కమిటీ వెల్లడించింది.
ఇప్పటికే సీనియర్ పీజీ విద్యార్ధి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అనతి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. అతని సెల్‌ఫోన్‌లో 17 వాట్సాప్ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ సైఫ్ అవమానించారు. తనతో ప్రాబ్లమ్ ఉంటే హెచ్ వోడీకి చెప్పాలని సైఫ్ కు ప్రీతి వార్నింగ్ ఇచ్చారు. ప్రీతిని వేధించాలని సైఫ్ తన స్నేహితుడికి చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డికి సైఫ్ చెప్పారు.
అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డిని కమిటీ సమావేశానికి పిలిపించి విచారించారు. సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసిందని, ఒక దశలో కన్నీళ్లు పెట్టుకుందని నాగార్జున రెడ్డి వివరించారు. ఎవరూ అండగా లేరనే నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటుందని కమిటీ నిర్ధారించింది. వేధింపులు కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయని అభిప్రాయపడింది.