Ponguleti: పార్టీ మార్పుపై పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
Ponguleti On Party Change: తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ నేతల దృష్టిని తనవైపు తిప్పుకోవాలని కేసీఆర్ చూస్తుంటే తనదైన కామెంట్స్ తో తన వైపు తెలంగాణ మొత్తం తిప్పి చూసేలా చేసుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం టీఆర్ఎస్ సహా తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఖమ్మం వైపే చూస్తున్నాయి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు కూడా ఒకరకంగా పొంగులేటి చూట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరు సీనియర్ నేతల ఫోకస్ అంతా ఇప్పుడు ఆయన పైనే ఉంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారబోతున్నారు..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? మారుతూ ఎంత మందిని తనతో తీసుకు వెళ్లబోతున్నారు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.. ఇక తాజాగా ఒక పేపర్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరుతానన్న విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మార్చిలో క్లారిటీ వస్తుందని వెల్లడించారు. తొందర పడి ఏ నిర్ణయం తీసుకోబోమని, అన్ని ఆలోచించాకే తన నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
సంప్రదించిన మాట వాస్తవమే కానీ
‘’పొంగులేటి బీజేపీలో చేరుతున్నాడని, లేదా కాంగ్రెస్ లో చేరుతున్నాడని చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయం తీసుకోలేను’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీ అన్నదానిపై కూడా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వైసీపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం తనను సంప్రదిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకునే సరికి రెండున్నర సంవత్సరాలు పట్టింది, సంక్షోభం లేని సమయంలో అంత టైం తీసుకుంటే ఈ పరిస్థితుల్లో అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోవడం కుదరదు. జాతీయ పార్టీలు తనను సంప్రదించిన మాట వాస్తవమే కానీ ఇంకా నా అభిప్రాయాన్ని మాత్రం ఎవ్వరికీ వెల్లడించలేదు.
దండయాత్ర చేసే అవకాశం
బీఆర్ఎస్ కోసం మొదటి నుంచి ఎంతో కష్టపడ్డా.. చివరికి పదవులు కూడా వదులున్నా, అయినా బీఆర్ఎస్ పార్టీలో ఆత్మాభిమానం దెబ్బతిన్నది. పార్టీలో ఉండాలని ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. కానీ పదవుల కోసం, వ్యాపారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల ఆశీస్సులు, దీవెనలతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా. నేను ఒక్కడినే ఒంటరి పోరు చేస్తున్నాను, నాపై అనేక మంది దండయాత్ర చేసే అవకాశం ఉంది. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని నిర్ణయించుకుని అందరినీ సంప్రదిస్తున్నా. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదిస్తే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని అందరి నిర్ణయం మేరకు ఆలోచన చేస్తా.
సభ విషయం కూడా తెలియదు
పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నుంచి ఎవరూ సంప్రదించలేదు. బహిరంగ సభ విషయం కూడా నాకు తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ సంప్రదిస్తే అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. నాకేం కావాలో కేటీఆర్ కు తెలుసు. పార్టీలోనే ఉండాలని నామా కోరారు. కానీ ఏది ఏమైనా భవిష్యత్తులో అందరి నిర్ణయం మేరకే నిర్ణయం ఉంటుంది, ఏ పార్టీలో చేరుతాననేది మార్చిలోనే తెలుస్తుంది.