MP Komati reddy Venkat reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
MP Komati reddy Venkat reddy: తనను చంపుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరించారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసునమోదు చేసారు. ఐపీసీ 506 సెక్షన్ కింద కోమటిరెడ్డిపై కేసు నమోదైంది. టిపిసిసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరకు సుహాస్ ను చంపుతానని బెదిరించిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయింది.
ఆడియో సంభాషణపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న వివరణ ఇచ్చారు. భావోద్వేగంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయానికి ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టాలని ఆయన చెరుకు సుధాకర్ ను కోరారు. ఉద్యమ నాయకుడినైన తనను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూషించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, వెంటనే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిందిపోయి ఆయన ఆలా మాట్లాడడం మంచిదికాదన్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్, కొడుకు సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.