Rajat Kumar: పోలవరంతో తెలంగాణకు ముప్పు: రజత్ కుమార్
Rajat Kumar Comment on Polavaram Project: ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ ముప్పు పొంచి ఉందని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో పోలవరానికి వరద వస్తే తెలంగాణకు చెందిన లక్ష ఎరకాల మేర పొలాలు ముంపుకు టురౌతాయని తెలిపారు. లక్ష ఎకరాల్లో పంటలతో పాటు భద్రాచలం, పర్ణశాల నీటిలో మునిగిపోతాయని నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
పోలవరం బ్యాక్ వాటర్ కారణంగానే ఈ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని రజత్ కుమార్ అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల కలిగే నష్టంపై అధ్యయనం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చాలాసార్లు నివేదించామని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ అధ్యయనంపై ఇప్పటిదాకా కేంద్రం నుంచి స్పందన రాలేదని రజత్ కుమార్ వివరించారు. పోలవరం వల్లే భద్రాచలం మునిగిపోయిందని తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం, వాటిపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో రజత్ కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల అధికారుల వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలవరం విషయంపైనా పార్లమెంట్లో ప్రశ్నించాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించారు. మరోవైపు పోలవరం నిర్మాణం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్ట్ పూర్తైతే పరిస్థితి ఏంటని విశ్లేషకులు అంటున్నారు. పోలవరం నిర్మాణంలోనే ఉంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని సూచిస్తున్నారు.