భవిష్యత్తు లేని పార్టీని ప్రజలు నమ్మరు: హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బుద్ది లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలన్నారు. భవిష్యత్తు లేని పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. కుర్చీల కోసం కొట్టుకునే పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులు నష్టాల పాలు కాకూడదని కేసీఆర్ ఎంత కష్టమైనా రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారన్నారు.
యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్ అన్న హరీష్ రావు.. కేంద్రం వైఖరి నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించినట్లు ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్యను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తుందన్నారు. తెలంగాణపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అప్పులు తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా రాష్ట్రంపై నరేంద్ర మోడీ కక్ష సాధిస్తున్నారన్నారు.