సినిమా ఫ్రీగా చేయమంటే చేస్తా కానీ అవి మాత్రం ఇవ్వను: పవన్ కళ్యాణ్
లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన ‘నేతాజీ’ గ్రంథ సమీక్షలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పాస్పోర్ట్ ఆఫీసర్ రాజశేఖర్ నన్ను టోక్యోలోని నేతాజీ అస్థికలు ఉన్న గుడిలోకి తీసుకెళ్లారని, డిఎన్ఏ టెస్ట్ వచ్చాక కూడా నేతాజీ అస్థికలు ఎందుకు తీసుకురావడం లేదు అన్న బాధ ఉందని అన్నారు. మూడు కమిషన్లు వేసినా తీసుకురాలేదు నేతాజీ అస్థికలు..పీవీ నరసింహారావు తీసుకువద్దామని అనుకున్నా కుదరలేదని, మనం నేతాజీ అస్థికలు తీసుకురావాలని కోరుకోవాలని పవన్ అన్నారు. నేతాజీని మనం గౌరవించుకోకపోతే మనం భారతీయులం కాదని పవన్ పేర్కొన్నారు. టోక్యోలోని రెంకోజీ టెంపుల్ లో నేతాజీ అస్థికలు దిక్కులేకుండా ఉన్నాయని ఆయన అన్నారు. నేను ఎప్పుడు డబ్బుల వెంట పడలేదన్న ఆయన నేను ఒక సినిమాని ఫ్రీగా చేయమంటే చేసేస్తాను..కానీ నాకు నచ్చిన బుక్స్ ఇవ్వమంటే ఇవ్వలేనని అన్నారు. డబ్బు పోతుంది..మన మేధస్సు పోదని పవన్ అన్నారు. కనీసం 100 రూపాయల నోటు మీద అయినా నేతాజీ బొమ్మ ఉండాలని పేర్కొన్న పవన్ నాకు ఒక సినిమా హాట్ అయితే వచ్చే ఆనందం కంటే ఒక దేశభక్తుని స్మరించుకుంటే వచ్చే ఆనందం ఎక్కువని అన్నారు. నిన్న మొన్న వచ్చిన నాయకులకు స్మారకాలు ఉన్నాయి కానీ నేతాజీ ఆస్థికలు తీసుకురావడానికి సమయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.