Palla Rajeshwar: తెలంగాణ గవర్నర్ పై పల్లా ఫైర్!
Palla Rajeshwar: తెలంగాణ గవర్నర్ తమిళిసై పై బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజానికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం మీద రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించకుండా.. రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలని అంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ఆమె కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. ఇదే విషయం మీద పల్లా ఆమె మీద ఫైర్ అయ్యారు.
రిపబ్లిక్ డే ఎలా జరపాలో రాష్ట్ర సర్కార్ కు తెలుసన్న ఆయన సీఎం కేసీఆర్ గవర్నర్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్న ఆయన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లును గవర్నర్ తొక్కి పెట్టి నిరుద్యోగుల ఉసురు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోటోకాల్ పాటిస్తున్నట్టు పేర్కొన్న ఆయన గవర్నర్ కు బీజేపీ ప్రోటోకాల్ కావాలంటే ఏం చేయలేమని ఎద్దేవా చేశారు. ఇక రాజ్‌భవన్‌లోనే ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్న ఆమె అక్కడ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపక పోవడాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది.