అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నేతలు హద్దు మీరుతున్నారు. ఇష్టానుసారంగా దుమారం లేపే వ్యాఖ్యలు చేస్తున్నారు.
Palla Rajeshwar Reddy: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నేతలు హద్దు మీరుతున్నారు. ఇష్టానుసారంగా దుమారం లేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఇతర పార్టీల నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వచ్చిన వారిని కూడా వదలడం లేదు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన నేతలను కుక్కలతో పోల్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనగామ నియోజకవర్గంలోని ఫోడషపల్లిలో కార్యకర్తలతో మాట్లాడుతూ.. పల్లా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కుక్కలని.. అటువైపు ఉంటే మొరుగుతారనే.. బీఆర్ఎస్‌లో చేర్చుకొని దొడ్లో కట్టేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అటువైపు ఉన్న కుక్కలను ఇటు తీసుకొని వారిని పిల్లిలాగా మార్చేశారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ కండువాలు కప్పి వారిని గిరిదాటకుండా చేస్తున్నారని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఎవర్నీ నోరెత్తకుండా ఎలా చేయాలన్నది సీఎం కేసీఆర్ తనతో తరచూ చెప్పేవారి పల్లా చెప్పుకొచ్చారు.
పల్లా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఏ క్షణమైనా సీఎం కేసీఆర్‌ను కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. అటు జనగామ నియోజకవర్గంలో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి మితిమీరిపోతున్నారని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారట. ఇప్పటికే అసంతృప్తుల తిరుగుబాటుతో గరం గరంగా ఉన్న కేసీఆర్.. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది చర్చనీయాంశంగా మారింది.