Khammam NTR Statue: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వివాదాల్లో చిక్కుకుంది. అభిమానంతో ఏర్పాటు చేయాలనుకున్న విగ్రహం ఆగ్రహాలకు కారణమైంది. అభ్యంతరాలతో మార్పుకు సిద్దమైనా న్యాయస్థానం అనుమతించ లేదు. ఈ నెల 28న ఎన్టీఆర్ జన్మదినం. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో విగ్రహావిష్కరణ ఇప్పట్లో ఉండదని తేలిపోయింది. అటు నిర్వాహకులు హైకోర్టు ఆదేశాల మేరకు పలు మార్పులు చేసారు. యాదవ సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారు.వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటును ఆపాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అభిమానం వర్సస్ న్యాయస్థానంగా మారిపోయింది.
ఖమ్మం లకారం చెరువులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కృష్ణావతార విగ్రహం ఏర్పాటు చేయాలని అభిమానులు నిర్ణయించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మే 28న దీన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని రూ. 2.3 కోట్లతో నిజామాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఎన్టీఆర్ శత జయంతి రోజున ఈ విగ్రహాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ను కృష్ణుడి రూపంలో పెట్టటం పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశం పైన హైకోర్టులో 14 పిటీషన్లు దాఖలయ్యాయి.
ఈ వివాదం వేళ కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు మరింత కాక పెంచాయి. హిందూ, యాదవ సంఘాల ఆందోళనలు మొదలయ్యాయి. కళ్యాణి చేసిన వ్యాఖ్యల పై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. వివరణ ఇవ్వకపోవడంతో ఆమెను సంఘం నుంచి సస్పెండ్ చేసారు. ఆ నిర్ణయాన్ని కరాటే కళ్యాణి తప్పుబడుతూ ప్రశ్నించారు. కరాటే కల్యాణి ఫెయిట్ ఆర్టిస్ట్ లతో రాద్ధాంతం చేయించారనే ఆరోపణలు వినిపించాయి. కోర్టులో విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిలిపేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, పిటిషన్దారులను ఆదేశించింది. తుదిపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది.
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై జరుగుతున్న వివాదంపై విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు స్పందించారు. కోర్టు అనుమతితోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని అవిష్కరిస్తామని తెలిపారు. ట్యాంక్ బండ్ బ్యూటీఫికేషన్ కోసం మాత్రమే విగ్రహ నిర్మాణం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ అందరివారని, దయచేసి రాజకీయం చేయవద్దని విగ్రహా కమిటీ సభ్యులు సూచించారు. ఎవరి మనోభావాలను బాధపెట్టాలనే ఆలోచన తమకు లేదని, ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంలో మార్పులు చేసి కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.కృష్ణుడి పోలికలు ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్వల్ప మార్పులు చేసి విగ్రహాన్ని అవిష్కరిస్తామని విగ్రహ కమిటీ సభ్యులు చెప్పారు. అభ్యంతరం లేకుండా నెమలి పింఛం, పిల్లనగ్రోవి తొలగిస్తున్నామని, రాజకీయాలకు, ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
కోర్టు ఉత్తర్వులు, యాదవ సంఘాలను గౌరవిస్తూ విగ్రహంలో మార్పులు జరుగుతున్నాయి. నీలిమేఘ శ్యాముడుగా ఉన్న శ్రీ కృష్ణుడుకి కలర్ మార్చి గోల్డ్ కలర్ వేస్తున్నారు. విగ్రహం నుండి కిరీటం, నెమలి పించం, విష్ణు చక్రం, పిల్లిన గ్రోవీలను తొలగించారు. కానీ, ఇప్పట్లో విగ్రహావిష్కరణ సాధ్యపడేలా పరిస్థితులు అనుకూలించటం లేదు. ఇప్పుడు 28న ఎన్టీఆర్ జన్మదినం నాడు ప్రారంభం చేయకపోతే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకొని మరో మహూర్తం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అన్న గారి పైన అభిమానంతో ఏర్పాటు చేసుకుంటున్న విగ్రహం పైన వివాదాలు చుట్టుముట్టటంతో భవిష్యత్ లో చోటు చేసుకొనే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.