New TRS Party: తెలంగాణాలో మరో టీఆర్ఎస్ – అధికార పార్టీయే లక్ష్యంగా..!
New Political party TRS ready to start in Telangana: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదవుతోంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీ స్థానంలో మరో టీఆర్ఎస్ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. తెలంగాణ ప్రజలతో రెండు దశాబ్దాల కాలం కొనసాగిన టీఆర్ఎస్ పేరుతో పార్టీ స్థాపించి..వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టటమే అసలు వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం అధికార పార్టీకి దూరమైన ముఖ్యులు ఈ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇందులో కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డికి చెందిన ప్రముఖులు వస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి సంబంధం ఉందని ప్రచారం సాగుతోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలో చేరలేక, కాంగ్రెస్ పై నమ్మకం లేక చౌరస్తాలో నిలిచిన రాజకీయ నేతలను ఆకర్షించటమే ఈ కొత్త పార్టీ లక్ష్యంగా తెలుస్తోంది.
తాము అధికారంలోకి వచ్చినా రాకున్నా..టీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల్లో నిలబడటం ద్వారా బీఆర్ఎస్ కు నష్టం కలుగుతుందని ఆ నేతల అంచనాగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు ఆ పేరుతో ఎన్నికల బరిలోకి దిగలేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే బీఆర్ఎస్ తెలంగాణలో పోటీ చేసే తొలి ఎన్నికలు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు టీఆర్ఎస్ అంటే అధికార బీఆర్ఎస్ అనే నమ్ముతున్నారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలనేది ఈ కొత్త పార్టీ నిర్మాతల అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజ్య పార్టీ, లేదా తెలంగాణ రైతు పార్టీ ఈ రెండు పేర్లలో ఒకటి ఫైనల్ అవుతుందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. రంగు కూడా గులాబీ ఉంటుందని తెలుస్తోంది. దీని పైన అధికారికంగా నేతల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కొత్త పార్టీ ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచనలంగా మారుతోంది.