Covid 19: తెలంగాణలో పెరుగుతున్న కేసులు..కొత్త మార్గదర్శకాలు విడుదల
New Covid 19 Guidelines in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కేసులను కట్టడి చేసేందుకు మళ్లీ ఆంక్షల విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా కట్టడికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ఆరోగ్యశాఖ. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు, పదేళ్ల లోపున్న చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్దులు తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లాలని లేదంటే ఇంట్లోనే ఉండాలని సూచించింది. 20 నుంచి 50 ఏళ్ల వయసున్న వారికి కరోనా అధికంగా సోకుతుండటంతో వారంతా తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నది.
ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. పనిచేసే చోట సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నది. అత్యవసరమైతే తప్పించి ప్రయాణాలు చేయవద్దని, జ్వరం, శ్వాస తీసుకొవడంలో ఇబ్బందులు పడుతున్నవారు వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని పేర్కొన్నది. దీర్ఘకాలిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నవారు ఇంట్లోనే ఉండాలని, చికిత్సకోసం మాత్రమే బయటకు వచ్చేలా చూసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. క్రమంగా కరోనా కేసులతో పాటు యాక్టీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 403 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.