తెలంగాణ బీజేపీలో కొత్త తగువు
తెలంగాణ బీజేపీలో కొత్త తగువు మొదలైంది. సీఎం కుర్చీ కోసం ఇప్పుడే కర్చీఫ్ వేస్తున్నారు. శాసన సభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లు’గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితే యువత సమస్యలన్నీ పరిష్కారమవుతాయని జితేందర్ రెడ్డి చెప్పటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ చీఫ్ అయ్యాక పార్టీ కాస్త పుంజుకుందేమో గానీ ఏకంగా అధికారంలోకి వచ్చేంతగా బలపడలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా జితేందర్ రెడ్డికి తెలియంది కాదు. అయినా ఆయన బండి సంజయ్ వద్ద ప్రశంసలతో మంచి మార్కులు కొట్టేయాలని సీఎం పదవి గురించి ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తన కొడుక్కి కూడా వచ్చే ఎలక్షన్ లో టికెట్ ఇప్పించుకోవాలనేదే జితేందర్ రెడ్డి అసలు లక్ష్యమనే టాక్ వినిపిస్తోంది.
రేసులో మరో ముగ్గురు
తెలంగాణలో ఒక వేళ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును తెర మీదికి తెచ్చారు. ఎంపీ సోయం బాపూరావు కిషన్ రెడ్డిని కాబోయే సీఎం అని గతంలో ఒక సభలో అభివర్ణించారు. పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సైతం ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారని మరికొందరు చెబుతున్నారు. ఆయనకు ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఉండటం కలిసి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరో వైపు.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వర్గం కూడా ఈ దిశగా పావులు కదుపుతోందని తెలుస్తోంది.
ఎప్పుడూ లేదు.. ఇప్పుడే ఎందుకిలా?..
బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించే సంప్రదాయం లేదు. పార్టీ గెలిచాకే హైకమాండ్ నిర్ణయిస్తుంది. అయినా తెలంగాణ బీజేపీలో అప్పుడే ముఖ్యమంత్రి క్యాండేట్ గురించి ఎందుకు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారో అర్థం కావట్లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో పైచేయి కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.