Revanth – KVR Meet: రేవంత్… కోమటిరెడ్డి సడన్ లవ్ ..లెక్క పక్కా..
Congress MP Komatireddy meets TPCC Chief Revanth: కాంగ్రెస్ కార్యకర్తల కోణంలో ఇది అత్యాశే అయినా.. వారిలో ఈ ఆశ మాత్రం ఉంది. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక గాంధీభవన్‌కు దూరంగా ఉంటూ వస్తున్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో అడుగు పెట్టడం తెలిసిందే. పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఈ నెల 20న నిర్వహించిన సమావేశానికి కోమటిరెడ్డి హాజరయ్యారు. మాణిక్యం ఠాగూర్ స్థానంలో వచ్చిన ఠాక్రే.. వచ్చీ రాగానే సీనియర్లందరితో చర్చలు జరుపుతూ ఎవరికి ఎలా దారికి తెచ్చుకోవాలన్న దానిపై ద్రుష్టి పెట్టారు. కాంగ్రెస్‌లో తలపండిన నేత అయిన ఠాక్రే.. మునుగోడు ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు షోకాజ్ నోటీసు అందుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషయంలో అవేవీ పట్టించుకోకుండా గాంధీభవన్‌కు రావాల్సిందిగా స్వయంగా ఫోన్ చేశారు. దీంతో మెత్తబడ్డ కోమటిరెడ్డి.. గాంధీభవన్‌కు కాకుండా ఠాక్రే బస చేసిన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల పట్ల కోమటిరెడ్డి సంత్రుప్తి చెందినట్లు తెలుస్తోంది. అందుకే గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి వెళ్లారు. పనిలో పనిగా రేవంత్‌రెడ్డితోనూ ఏకాంతంగా సమావేశమై.. కలిసి పనిచేద్దామంటూ స్నేహహస్తం అందించారు. కాంగ్రెస్ శ్రేణులకు ఇది సంతోషం కలిగించే విషయమే కానీ, ఈ సందర్భంగా రేవంత్ వద్ద కోమటిరెడ్డి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాజాగా వేసిన పీసీసీ కమిటీల్లో తనవారికి చోటు విషయం ఒకటైతే.. అత్యవసర డిమాండ్ ఒకటి ఆయన వద్ద పెట్టారు. అది.. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా తన సన్నిహితుడైన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలన్న డిమాండ్. అయితే ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకరిని, పొన్నాల లక్ష్మయ్య మరొకరి పేరును సూచించారని రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది.
వారితో మాట్లాడుకొని ఏకాభిప్రాయానికి రావాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఇది ఏమయ్యేది తెలియని పరిస్థితి నెలకొ్ంది. ఇలాంటి డిమాండ్ మరిన్ని ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు రేవంత్‌రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర విషయంలో కూడా కోమటిరెడ్డి కొత్త ప్రతిపాదన పెట్టినట్టు చెబుతున్నారు. ఇద్దరం కలిసి ఉమ్మడిగా పాదయాత్ర చేద్దామంటూ రేవంత్‌కు వెంకట్‌రెడ్డి సూచించినట్టు సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగి్ంపుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతుండగా.. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ అంశం ఇంకా అధిష్ట్ఠానం పరిధిలోనే ఉంది. దీనికి ఇంకా అనుమతి రాలేదు. అయితే తాజాగా కోమటిరెడ్డి ఉమ్మడి పాదయాత్ర ప్రస్తావన తేవడం రేవంత్‌కు ఇబ్బందికరంగానే పరిణమించనుందని ఆయన వర్గీయులు అంటున్నారు. వాస్తవానికి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డిని అధిష్ఠానం గతంలోనే నియమించింది.
ఆ హోదాలో తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని వెంకట్‌రెడ్డి కూడా చాలాసార్లు చెప్పారు. కానీ, రేవంత్‌తో ఆయనకు పొసగకపోవడం, తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం, తప్పే అయినా తమ్ముడికి మద్దతుగా మాట్లాడాల్సి రావడం.. వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. తాజాగా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలంటూ మాణిక్‌రావు ఠాక్రే సూచిస్తున్న నేపథ్యంలో సరేనంటూ కోమటిరెడ్డి ముందుకొచ్చారు. కానీ, రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గానే అంగీకరించలేని వైఖరితో ఉన్న కోమటిరెడ్డి తన మాటకు కట్టుబడి ఉంటారా? రేవంత్‌కు సహకరిస్తారా? అంటే అనుమానమే. ఓవైపు ముందస్తు ఎన్నికలు జరగవచ్చన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో టికెట్ల విషయంలోనూ ఈ లొల్లి జరిగే అవకాశాలు లేకపోలేదు. కోమటిరెడ్డి ఒక్కరే కాకుండా.. ఇతర సీనియర్లు కూడా తమకంటూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారు. వారికి టికెట్లు కావాలని అడిగే అవకాశం ఉంది. దాంతో రేవంత్ పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా తయారైంది. భవిష్యత్తులో వీరంతా ఏకతాటిపైకి వచ్చి అధికారం సాధించుకుంటారో, లేక మరోసారి కేసీఆర్ చేతికి అప్పగిస్తారో చూడాల్సి ఉంది.