MLC Kavitha: సుప్రీంకోర్టుకు కవిత ..రేపు ఈడీ విచారణ
MLC Kavitha to Attend before ED in Delhi Liaquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే కవితను ఈడీ సుదీర్ఘంగా విచారణ చేసింది. తిరిగి ఈ నెల 16న హాజరు కావాలని సూచించింది. ఈ సమయంలోనే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫు లాయర్ వివరించారు. ఈ కేసులో కవితకు చుక్కెదురైంది. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కానున్నారు.
ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీ కేంద్రంగా దీక్ష చేసిన కవిత కొనసాగింపుగా మరో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసారు. పలు రాజకీయ పార్టీల నేతలతో పాటుగా మహిళా సంఘాల నేతలను ఆహ్వానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకూ పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేసారు. రేపు తాను ఈడీ విచారణకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో తనకు ఎటువంటి ప్రమేయం లేదని కవిత పేర్కొన్నారు. రాజ్యంగం మహిళలకు సమాన హక్కులు కల్పించిందని..వీటిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కవిత మొబైల్ ను ఈడీ సీజ్ చేసింది. తనకు నోటీసుల్లో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న వారితో కలిపి విచారిస్తామని పేర్కొన్నారని..కానీ, విచారణ సమయంలో అలా జరగలేదని వివరించారు. ఈ పరిస్థితుల్లో కవిత విచారణ సమయంలో చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ నెలకొంది.