Kavitha interrogation: కవిత విచారణ పూర్తి..16న మరోసారి ఈడీ ముందుకు
Enforcement Directorate interrogate MLC Kavitha in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత విచారణ పూర్తయింది. కవిత ఈ రోజు ఢిల్లీలో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ తరువాత కవిత ఢిల్లీలోని తమ నివాసానికి వెళ్లిపోయారు. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ సూచించింది. గత ఏడాది కాలంగా విచారణ సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. కాగా, కవిత అరెస్ట్ తో ఈ కేసుల కీలక దశకు చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో సౌత్ ఇండియా గ్రూపు ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. అభియోగాల పైన కవిత నుంచి ఈడీ స్టేట్ మెంట్ రికార్డు చేసింది. రామచంద్ర పిళ్లైతో పాటుగా కవితను విచారించినట్లు సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రముఖులతో పాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ను కూడా ఈడీ అరెస్ట్ చూపించింది. రామంచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ, రామచంద్ర పిళ్లై తాను ఈడీ కి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీంతో, కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. కవిత ఈడీకి విచారణకు హాజరవుతున్న వేళ కేటీఆర్, హరీష్ తో సహా పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది.
బీజేపీ కక్ష పూరితంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కవిత చెబుతూ వచ్చారు. కవిత విచారణ వేళ తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.అటు బీజేపీ నేతలు మాత్రం ఈడీ విచారణలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేస్తున్నారు. లిక్కర్ స్కాం లో నిందితులు కవిత పేరు చెప్పటంతోనే విచారణ జరిగిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని కవిత నోటీసులు వచ్చిన సమయంలో చెప్పారు. ఇప్పుడు సుదీర్ఘ విచారణ తరువాత కవితను మరోసారి విచారణకు ఈ నెల 16న రావాల్సి ఉందని ఈడీ ఏం చెప్పినట్లు తెలుస్తోంది.