Vemula: తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు!
Minister Vemula: గత కొన్నాళ్లుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయం మీద స్పందించిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరమే బిఆర్ఎస్ కు లేదన్న ఆయన పూర్తి కాలం అధికారంలో ఉంటామని అన్నారు. రేవంత్, బండి సంజయ్ కు ఇంకా 9 నెలల కాలం ఉందని పేర్కొన్న ఆయన ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోండని సలహా ఇచ్చారు. ఎంపీ అర్వింద్ తనను బేవకూఫ్ అన్నారు, ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
రాజకీయాల కోసం ఎంపీ అర్వింద్ కుల మతాల మధ్య, యువత మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధర్మపురి అరవింద్ ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా మంచి చేయాలి కానీ నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను తిట్టిన పర్వాలేదు కానీ ప్రజలకు మంచి చేయాలని మంత్రి సూచించారు. ఇక సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు, రాజకీయాలకు, అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్న మంత్రి బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలంలో ఆదివారం ఒక్కరోజే సుమారు 6 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు.